భాషల కుటుంబాలు

+4

నమస్కారం!

నమస్కారం అందరికి! ఈ మొదటి తెలుగు వ్యాసానికి మీకు స్వాగతం! తెలుగులో జెట్పంక్లోనే కాకుండా మొత్తం అంతర్జాలంలో భూగోళశాస్త్రం, భాషాశాస్త్రం, చరిత్ర లాంటి విషయాలు గురించి బ్లాగులూ యూట్యూబ్ విడియోలూ చాలా తక్కువ, కాబట్టి జెట్పంక్లో బ్లాగ్ల ద్వారా అంతర్జాలంలో తెలుగు భాష ముఖ్యం పెంచుతామని ఆశిస్తున్నాను. కానీ త్వరలో రాబోతున్న బ్లాగ్లో ఇంకొన్ని తెలుగు జెట్పంకర్ల తో పాటు “తెలుగు జెట్పంక్” గురించి ఎక్కువ చెప్తాను. ఇప్పటికి "భాషా కుటుంబాలు" అనే విషయం చూద్దాం. నేను చెయ్యబోతున్నవాటిల్లో దీని గురించి చాలా వ్రాస్తాను, కాబట్టి ఆ బ్లాగ్లు చేశేముందు ఇక్కడ భాషా కుటుంబాలకు సంబంధించిన తెలియాల్సినవన్నిటిని వివరించడానికి ప్రయత్నిస్తాను.

ప్రపంచంలో చాలా వరకు మీరు మాట్లాడే మాతృభాష ఏమైనా, ఆ భాషకు దగ్గరున్న భాషలు కొన్నుంటాయి, వీట్లో మీకు చాలా తెలిసిన పదాలు కనిపిస్తాయి, కొన్ని సార్లు ఆ భాషలని అర్ధం కూడా చేసుకోవగలుగుతారు. ఉదాహరణకు, మన భాషకు దగ్గరున్న భాషలు కన్నడం, అరవం, మరియు మలయాళం, ద్రావిడ కుటుంబమనే ఈ భాషలు దక్షిణ భారతదేశంలో ప్రధాన భాషలు, కాబట్టి వాళ్ళ కుటుంబం ఒక్కటే అంటే ఆశ్చర్యం కాదు. కానీ ఈ కుటుంబాల గురించి ఎక్కువ నేర్చుకుంటే చాలానే ఆశ్చర్య విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు, ఉత్తర భారతీయ భాషలూ ఆంగ్లమూ ఒక్క కుటుంబం నుండే చెందినవని చాలా మందికి ఆశ్చర్యం గావుండచ్చు. లేకపోతే పాకిస్తాన్, అశ్వకనస్థానం, మరియు తురకమేనుస్థానం లో మాట్లాడే ద్రావిడ భాష ఉందని ఆశ్చర్యం గావుండచ్చు. వీటి తో కూడా మీరు ఆశ్చర్యపడలేదంటే, ఈ బ్లాగు చివ్వరిలో కొన్ని రహస్యాలు నిజానికి ఏవో ఆలోచనలు చెప్తాను, అవి తప్పుకుండా మిమ్మల్ని అదిరికొట్టేస్తాయి! సరే, మొదలెట్టుదాం!

భాషా కుటుంబమంటే ఏంటి?

ప్రపంచంలో కొన్ని భాషలు ఏవైనా తీసుకుంటే, వాటి మధ్య తప్పుకుండా ఏవో ఒక లాగావున్న మాటలుంటాయి. కాబట్టి కుటుంబమనే పదం వేటికి వాడుతాం?

ఒక మూల భాష నుండి వచ్చే భాషలన్ని ఒక భాషా కుటుంబం. ఉదాహరణకు, ప్రాకృతం ద్వారా వైదిక సంస్కృతం నుండి చెందిన భాషలు ఇండో-ఆర్య భాషలు. తెలుగులో సంస్కృతం మాటలున్నా, అది పాత ద్రావిడ భాషల నుండి చెందినది, కాబట్టి ఇండో-ఆర్య భాష కాదు. సరే, మొదటి భాష నుండి చెందిన భాషలు కూడా కుటుంబాలు మొదలెట్టితే ఏం? ఇవి మొదటి కుటుంబానికి శాఖలు అవుతాయి, దాని తరువాత వచ్చిన చిన్న కుటుంబాలన్ని శాఖలే. ఉదాహరణకు, ఇండో-ఆర్య భాషలు నిజానికి ఒక శాఖే, ఎందుకంటే వైదిక సంస్కృతానికి కూడా ఇంకా దూరంగా సంబంధించిన భాషలున్నాయి, వేటి తో పాటు ఇండో-ఐరోపా భాషా కుటుంబం వస్తుంది.

దీని తో చాలా ప్రశ్నలు మిగులుతున్నాయిగానీ అవన్ని వచ్చే భాగాల్లోవుంటాయి. ఇది చెప్పకుండా ముందుకెళ్ళలేను గా 😅

చెట్ల శాఖలు
వైదిక సంస్కృతం నుండి చెందిన భాషలు, ఇండో-ఆర్య శాఖ

కొన్ని కుటుంబాలు ఏవి?

దీన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూసుకోవచ్చు. మన భాష కుటుంబం, ముందే చెప్పినట్టు, ద్రావిడ కుటుంబం. అందులో దక్షిణ-మధ్య అనే శాఖ తెలుగుది. ముందే చెప్తున్నాను ద్రావిడ శాఖల పేర్లు అంత ఆశక్తకరమైనవి కావని.

జనగణన ప్రకారం ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో ప్రధాన భాష
భారతీయ ఉపఖందంలో కొన్ని భాషా కుటుంబాలు

భారతదేశం ప్రధాన ౨౨ భాషలలో ౪ కుటుంబాలు కనిపిస్తాయి: ఇండో-ఐరోపావి, ద్రావిడవి, ఆస్ట్రో-ఆసియావి (అంటే దక్షిణ ఆసియావి), మరియు సీనో-తిబెత్తువి. మనకు తెలిసినంతవరకు, ఇంకా పెద్ద కుటుంబాల్లో శాఖలు కాకుండా, ఇవే కుటుంబాలు. అయినా కూడా, దీని గురించి ఇంకా పరిశోధన ఎప్పుడూ అవుతుంటుంది, కాబట్టి పెద్ద కుటుంబాలు కనిపెట్టడం గురించి కూడా తరువాత చెప్తాను. ఈ ౨౨ భాషల్లోని ఇండో-ఐరోపావి ఇవి: హిందీ, అస్సామీ, వంగభాష/బాంగ్లా, డోగ్రీ, గుజరాతీ, కాశ్మీరీ, కోంకణీ, మైథిలీ, మరాఠీ, నేపాలీ, ఓఢ్రం/ఒడియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, ఉర్దూ. ఈ ౨౨లో రాకపోయినా, భోజ్పురి కూడా చాలా పెద్ద భారతీయ ఇండో-ఐరోపా భాష. ద్రావిడవి: తెలుగు, కన్నడం, అరవం, మలయాళం. సీనో-తిబెత్తువి: మణిపురి, బోడో. చివరిలో, కేవలం ఆస్ట్రో-ఏసియాది సంతాలి.

ఈ నాలుగు కుటుంబాలు చూస్తే, ద్రావిడదాని తప్ప వాటన్నిటి ప్రధాన భాషలు చాలా వరకు భారతదేశం బయటున్నవి. ఇండో-ఐరోపా పేరు ఎందుకు వచ్చిందంటే దాని ప్రధాన భాషలు భారతదేశం ఐరోపా రెండిట్లోవున్నాయి.

ప్రపంచ ప్రధాన భాషల్లో వేరే ఇండో-ఐరోపా భాషలు కొన్నిటివి: ఆంగ్లం, స్పెయినీ, బుడతకీచు, రష్యాభాష, పరాసు, శర్మణ్యం, ఇటలీభాష, మరి పారశీకం.

ఆస్ట్రో-ఆసియా కుటుంబంలో పెద్దది చంపభాష.

సీనో-తిబెత్తు కుటుంబంలో చీనీ భాషలనేవి అతిపెద్దవి, ఉదాహరణకు మంత్రిభాష (చాలా సార్లు ఈ భాషనే చీనీ అంటారు), కంటోనీ, మరి షాంఘైనీ.

ఇంకొన్ని ముఖ్యమైన కుటుంబాలు: ఆఫ్రో-ఆసియా భాషలు, అరబ్బి యూదియా భాషల తో పాటు, ఆస్ట్రోనీసియా భాషలు, మలయభాష తో పాటు, అంధ-కాంగో భాషలు, ఆఫ్రికాలో చాలా భాషల తో.

ప్రపంచంలో భాషా కుటుంబాలు
కొన్ని ద్రావిడ భాషలు, వేరే వేరే శాఖలకు వేరే రంగుల తో

సరే, మరి ఇవి ముఖ్యమైన విషయాలు భాషా కుటుంబాల గురించి, ఇప్పుడు భాషాశాస్త్రం లోతులోకు వెళ్ళచ్చు. ఇలాంటి ఇంకా తక్కువ తెలిసిన భాషాశాస్త్రంలోని విషయాలు చూస్తున్నప్పుడు, భాగాలు గా విడిచేసే బదులు పట్టిన తెలియాల్సినవన్ని చూస్తుంటే నాకు ఎక్కువ బాగుంటుందనిపిస్తుంది. అలాగే, కొన్ని భాగాలు పెడ్తానుగానీ ఎక్కువ గా ఆలోచన ప్రవాహం తో వెళ్తూ నాకు తెలిసిన విషయాలు చెప్తాను. కొంచం చాటభారతం లాగా అనిపిచ్చచ్చేమో 😅

భాషలు ఎలా పుట్టుతాయి?

ఏదైనా భాష ఇంకేదైన భాష నుండి చెందిందని వింటే మామూలు గా అనిపిచ్చచ్చు, నాక అయితే అనిపిచ్చేది, కానీ ఎలా ఈ భాషలు కొత్త భాషలను కన్నాయని ఎలా అంటాం? భాషలకు మనుషుల కుటుంబాల గురించి మాటలు వాడుతారుగానీ, అవి కొంచం సూక్ష్మజీవుల లాగా మారుతాయి నిజానికి. అంటే, భాషలు విడిపోయి కొత్త భాషలకు మూలాలు అవుతాయి. ఇది అర్థమైందంటే ఈ మార్పులు ఏమిటో చెప్పనివ్వండి. ఈ మార్పులు భాషాశాస్త్రంలోని శాఖలు చాలావాటి ద్వారా అవుతాయి, కాబట్టి కోన్నిట్లో ఏమి అవుతుందో చూద్దాం ఉదాహరణల తో పాటు, ముందు చెప్పిన భాషా కుటుంబాలు బాగా అర్థం చేసుకునేందుకు.

ధ్వనిశాస్త్రంలో జరిగే మార్పులు అన్నిటి కంటే తేలిక గా చూడగలిగేవి, వీటి తోనే దగ్గరున్న భాషల మధ్య కూడా వాటి ధ్వనుల ద్వారా తేడా తెలియచ్చు చాలా సార్లు. తెలుగులో ఇప్పుడు అవుతున్న ధ్వని మార్పులు చూడచ్చు.

మొదటి గా తెలుగుకు సంబంధించిన ధ్వని మార్పులు నాలుగు స్థాయుల్లో చూద్దాం. మొదటిది తెలుగులో ఇప్పుడు అవుతున్న మార్పు. భాష ఎల్లప్పుడూ-మారుతున్నది, కాబట్టి ఖచ్చితం గా మీకు చాలా ఇప్పుడు అవుతున్న ఉదాహరణలు దొరుకుతాయి, కానీ నాకు ఎక్కువ కనిపిచ్చేది "ళ"ను "ల" లాగా అన్నడం. లేకపోతే భాషాశాస్త్ర నామం గా దీనికి "ళ-ల విలీనం" అనచ్చు. ఈ విలీనం తో మాట్లాడేవాళ్ళు దాని లేకుండా మాట్లాడేవాళ్ళు రెండూ వినబడతారు ఈ సమయంలో, కాబట్టి భవిష్యత్తులో దీనికి ఏమి అవుతుందో సరిగ్గా తెలియదు. ఇది కొన్ని యాసల్లోనే రావచ్చు, లేకపోతే తెలుగులో ఈ ధ్వని మాయమవోపోవచ్చు. ఇది ముందు కొన్ని సార్లు అయింది, కాబట్టి ఇది ఏమీ కొత్త విషయం అవ్వదు, కానీ ప్రాచీన తెలుగు తరువాత అయిన మార్పులు మూడవ స్థాయిలో చెప్తాను.

రెండవ స్థాయిలో ఇదివరకు అయిన మార్పు, అది ఇప్పుడు కొన్ని యాసల్లోనే ఉంది. అది "చ"ను "స" గా పలకడం. ఇది కొన్ని యాసల్లోనే చాలా వాడుతారు, కానీ పాటల్లో చాలా కనిపిస్తుంది, ఉదాహరణకు నాటు నాటు ("నా పాట సూడు"). ఇప్పటికి ఎవ్వరూ కొత్త గా ఇలా మాట్లాడటన్లేదు, కాబట్టి ఈ మార్పు ఇప్పటికే అయిందనచ్చు. కానీ నాటు నాటు బహుమానాలన్ని గెలిచాక విశ్వగీతం అయ్యాక అందరు ఇలా మాట్లాడుతారు!

మరి మొదటి మార్పు ఇలా తయ్యారి అవ్వచ్చు, కొంత మందికే ఉంటుందేమో. కానీ ఇప్పుడే అన్నట్టు మూడవదాని లాగా అవ్వడం కూడా ఒక అవకాశం. ఈ స్థాయిలో చూడబోతున్న ధ్వని "ఴ". ఇప్పటి తెలుగులో ఈ ధ్వనినూ దాని అక్షరం పూర్తిగా మర్చిబోయినవి కానీ తెలంగాణలో చిన్న అడివిలో ఒక గ్రామ మాండలికంలో ఉందని అవకాశం ఎప్పుడూ ఉండచ్చేమో, కానీ ద్రావిడ ధ్వనిశాస్త్రం గురించి మీకు కొంచం తెలుసంటే వినుండచ్చు. నిజానికి ఇది అరవంలోని ధ్వని, కాబట్టి అది ఎంతైనా తెలుస్తే ఈ ధ్వని చూసుంటారు. అది అరవంలో చాలా వాడేది, అరవంలో దాని పేరు కూడా "తమిఴ్" ఈ అక్షరం తో పాటు. మీరు ఎప్పుడూ వినలేదంటే ఇలా వివరిస్తాను: అది మూర్ధన్య ధ్వని, టకార అక్షరాల్లో నాలుక పెట్టినట్టు పెట్టి "య" లాంటి తేలిక ధ్వని చెయ్యాలి, అంతస్థం అని పిలిచేది. మరి ఇది తెలుగులో కూడా ఉండేది, ఎందుకంటే ఇది ద్రావిడ ధ్వనే, కాబట్టి ఏమి అయింది? డ. అవును, పాత తెలుగులోని ఈ అక్షరం మొత్తం గా వెళ్ళిపోయి దాని చోటు "డ"కు ఇచ్చింది. ఒక ఉదాహరణకు "కోడి"కు అరవ మాట కోఴి, పాత తెలుగులో కూడా ఉన్నట్టు, కానీ తెలుగులో మారింది, అరవంలో మిగిలినా. కన్నడం కూడా ఈ ధ్వని తీసేసిందిగానీ "ళ" దాని చోటు తీసుకుంది, కాబట్టి వాళ్ళ మాట "కోళి". ఈ మార్పు కొత్త గా వచ్చిన అరవ మాటల్లో రాదు, ఉదాహరణకు "తమిఴ్" నుండి వచ్చిన ఇతర పేరు అరవానికి "తమిళం", "తమిడం" కాదు. కానీ ఇదివరకు ఇది "చోళ" అని మాట తో అయింది. ఈ అరవ సామ్రాజ్యానికి అరవ పేరు "చోఴ" లేదా "సోఴ", మరి తెలుగులో "చోడ" దానికి ఒక పేరు. తెలుగు చోడలని కూడా ఉండేవాళ్ళు, మరి వాళ్ళకు ఆంగ్లంలో కూడా ఎక్కువ గా "చోడ" అనే అంటారు. ఉదాహరణకు తెలుగు వాడిన మొదటి రాజ్యం రేనాటి చోడులది. చివరిలో ఇంకొక విషయం ఏమిటంటే అనకాపల్లి జిల్లాలోని చోడవరం పట్టణమూ దాని మండలాని పేరు చోడుల పేరు నుండి వచ్చింది.

చోడుల బృహదీశ్వర మందిరం
కర్నాటకలో హులులు
ఆంధ్రలో పులి

ఈ రెండు మార్పులు పద్ధతి గా అవుతాయి, మరి ఇది ముఖ్యమైన విషయం అవుతుంది ఇంకో భాగంలో. నాలుగవది కూడా ఇలాంటిదే, మరి ఇది ఇంకో ద్రావిడ భాషలో అయిన మార్పు, తెలుగులో అవకపోయినా. అది కన్నడంలో "ప" "హ" అవ్వడం. లేకపోతే కన్నడ అక్షరాల్లో "ಪ" "ಹ" అవ్వడం. ఇది కూడా కన్నడం వింటే తేలిక గా తెలుసుకోవచ్చు, కానీ దీనికి సంబంధించిన కథ ఇంకొక్కటి చెప్పగలను. ఆంధ్ర-కర్నాటక సరిహద్దు దాటుతుంటే పఠం చూస్తే చాలా పల్లులు కనిపిస్తాయి, మరి ఆంధ్రలో చాలావాటి పేర్లలో "పల్లి" చివరిలో ఉంటుంది. కానీ కర్నాటకలో చాలా "హల్లి"లు కనిపిస్తాయి. ఇది "పల్లి"కు కన్నడం మాటే, ఈ మార్పు తో పాటు. ఆంధ్రలో కర్నాటక సరిహద్దుకు దగ్గర వెళ్ళ్తే చాలా "హల్లి"లు వస్తాయిగానీ చాలా సార్లు దిని తో ఏ రాష్ట్రంలో ఉన్నారో తెలియచ్చు. మరి ఈ మార్పు గురించి ఇంకొన్ని విషయాలు చూద్దాం. చాలా సామాన్య మాటల్లో ఈ మార్పు చూడచ్చు. పాలు, పులి, పూవు అనే మాటలు ಹಾಲು (హాలు), ಹುಲಿ (హులి), ಹೂವು (హూవు). తెలుగులో "ఴ"కు అయినట్టు మాయమవ్వడం కన్నడ "ప"కు అవలేదు. ఉదాహరణకు కన్నడంలోని సంస్కృత మాటలకు ఇది అవలేదు, అలాగే "ప్ప" అని వచ్చినప్పుడు "హ్హ" అవకుండా ఇదివరకు ఉన్నట్టు మిగిలింది. ఉదాహరణకు "ఉప్పు"కు మాట "ఉప్పు"ఏ. అవును, చాలా సార్లు ఈ మార్పులు కొన్ని చోటుల్లోనే అవుతాయి, ఇలా మార్పులు పద్ధతుల్లో నియమాలు కూడా ఉండచ్చు. ఈ మార్పు ప్రపంచంలో సాధారణమైనది, మరి చాలా సార్లు "ప" "హ" మధ్యలో "ఫ" లాంటి ధ్వని అవుతుంది. ఇప్పుడు మన నాలుగు స్థాయులు అయ్యాయి, మరి భాషల మార్పులో ముఖ్యమైన విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇప్పుడు త్వర గా ఇంకొన్ని అవ్వగలిగే మార్పులు చూద్దాం.

విజయనగర సామ్రాజ్యంలో కన్నడం తెలుగు రెండూ అధికారిక భాషలు

చాలా సార్లు భాషలు మారుతుంటే వాటి మాటల అర్థాలు కొన్ని మారుతాయి. మళ్ళీ ద్రావిడ భాషల్లోనే నాకు చాలా ఇష్టమైన ఉదాహరణ ఉంది. ఒక ప్రాచీన ద్రావిడ భాష (కంగారు పడకండి, త్వర లో అది ఏమిటో చెప్తాను), అది అరవం, తెలుగు, కన్నడం, అన్నిటికి మూలం, అందులో "*ఓడు (*ōṭu)" అని ఒక మాట ఉండేది. ఆ భాషలో దాని అర్థం "పారిపోవడం", మరి దాని నుండి చెందిన భాషల్లో కూడా ఆ మాట మిగిలింది. తెలుగులో ఈ మాట ఉంది, ఓడడం అనే క్రియలో, అంటే ఓడిపోవడం. కానీ కన్నడం అరవం రెండిట్లో ఈ క్రియ ఉన్నా దాని అర్థం "పరిగెట్టడం". పారిపోవడం ఈ రెండు మాటల్లో మధ్యలో ఉందనచ్చు, కాబట్టి నాకు ఇది చాలా తమాషా గా అనిపిస్తుంది.

ఆ భాష ఇక్కడ మాట్లాడేవాళ్ళేమో...?

అంటే దీని తరువాత తేలిక గా భాషలు ఎలా మారుతాయో చెప్పాలంటే, ఈ మార్పులు ఒక భాషకు వేరే చోట్లలో వేరే గా అవుతుంటే కొత్త భాషలు గా అవుతాయి ఎప్పుడో.

బ్రాహ్వీ వార్తలు

మార్పుల ఇంకొ ముఖ్యమైన విధం వేరే భాషల నుండి మాటలు తీసుకోవడం. ఉదాహరణకు తెలుగు, కన్నడం, మలయాళమన్నిట్లో పదాలన్ని చూస్తే ఎక్కువ గా సంస్కృత పదాలేయుంటాయి, సంస్కృతం ద్రావిడ భాష కాకపోయినా. అలాగే పాకిస్తాన్లోని ద్రావిడ భాష బ్రహుయిలో ౧౦% మాటలే దాని ద్రావిడ మూలం నుండి వచ్చినవి, అందులోని మాటలకు ప్రధాన మూలం అరబ్బి. మరి ఇలా ఉందంటే ఒక భాష నిజం కుటుంబం ఏదో ఎలా చెప్తాం? అలాగే పెద్ద పెద్ద కుటుంబాలున్నాయని ఎలా తెలుస్తుంది? ఈ తక్కువ స్పష్టం గా చూడదగిన విషయాలన్ని అన్వేశించడానికి వచ్చే భాగం మొదలెట్టుదాం.

కుటుంబాలను ఎలా కనిపెట్టుతాం?

భాషల సంబంధాలకు వెతకడం కొంచం రహస్యం లాంటిదే. కానీ ఇంత వరకు చెప్పిన విషయాల తో కొన్ని సూచనాలు వచ్చున్నాయి, కాబట్టి అవి ఎలా వాడచ్చో చూద్దాం. ఇప్పుడు చాలా వరకు భాషలన్ని ఏదో కుటుంబంలో ఉన్నాయి (లేకపోతే వాటికి కుటుంబం లేదు), కానీ ఒక కొత్త కుటుంబం కనిపెట్టుతున్నామనుకుందాం. ఒక భాష కుటుంబముందని ఆలోచించడానికి మొదటి గా ఒక లాగా ఉన్న మాటలు కొన్ని కావాలి. కానీ మొదటిలో అన్నట్టు ఇదే చాలదు. ఇది అయ్యాక ఈ భాషల్లో ధ్వనులు వేరేవాటిల్లో ఎప్పుడూ అదే ధ్వని చోట్లో (మొదటి భాషల్లోనదే, లేకపోతే ఇంకో ధ్వని) వస్తుందని చూసుకోవాలి. మరి ఇది అయిందంటే, నిజంగా ఆ భాషలకు సంబంధముందంటే, మూల భాష నుండి మార్పుల్లో కొన్ని నియమాలుండుంటాయి, అందుకే ఈ నియమాల గురించి గుర్తుపెట్టుకోమన్నాను. కానీ ఇప్పుడు మర్చిపోవకండి.

ఇప్పుడు ఒక ఆశక్తకరిమైన అడుగు వేయాలి. ఆ ప్రాచీన ద్రావిడ భాష గుర్తుందా? దాని పేరు మూల-ద్రావిడం, ఇంకా ప్రతి భాష కుటుంబానికి మూల భాషా ఉంటుంది, ఉదాహరణకు మూల-ఇండో-ఐరోపా భాష, మూల-సీనో-తిబెత్తు భాష, మూల-ఆస్ట్రో-ఆసియా భాష. భాషా కుటుంబాలూ వాటి శాఖాలన్నిటికి మూల భాషాలున్నాయని అప్పుడే అన్నాను, ఉదాహరణకు వైదిక సంస్కృతం, కానీ ఈ "మూల" అని పేర్లో ఉన్న భాషలకు ఒక తేడా ఉంది. అవి నిజమైన భాషలు కావు. అంటే, అలాంటి భాషలుండేవని నేరుగా తెలుసుకోలేం, ఎందుకంటే అవి వినలేమూ చదవలేమూ, కానీ కుటుంబముంటే ఆ మూల భాష ఉండాలి కాబట్టి ఆ భాష ఎలాగో ఉండేదని తెలుసు. భాషా కుటుంబం కనిపెట్టుతున్నప్పుడు ఇప్పుడు ఈ భాష ఎలాగుండేదో తెలియాల్సినది. మనకు తెలిసిన మూల భాషల నుండి మార్పులు తెలుస్తే ఇందులో ప్రాచీన భాషల ధ్వనులకు చాలా దగ్గర రావచ్చు. ఉదాహరణకు, పాత కన్నడ నుండి ఆధునిక కన్నడం మార్పులో "ప" "హ" అయిందని తెలుసు. అలాగే చాలా చోట్లలో "ప"->"హ" ఒక సాధారణ మార్పు. కానీ "హ"->"ప" అంతగా అవ్వదు, కాబట్టి రెండు భాషల్లో మాటల్లో తేడా "ప" బదులు "హ" పెట్టడం అయితే, మూల భాషలో ఆ మాటలో "ప"ఏ ఉండుంటుందనచ్చు. వేరే విషయాల్లో కూడా ఇలాగే మళ్ళీ కట్టచ్చు. ఓడిపోవడం పరిగెట్టడం రెండిటి మధ్యలో పారిపోవడం వస్తుందనచ్చు, కాబట్టి మూలద్రావిడంలో "*ఓడు (*ōṭu)" అనే మాటకు అర్థం అదే అనుకున్నది. చిన్న వివరాలన్ని ఇలాగే చూస్తే చాలా మాటల తో ఒక మూలభాష వస్తుంది. మూల-ఇండో-ఐరోపా భాషలో కొన్ని కథలు కూడా రాసారు! బాగా తెలియకపోయినా, ఈ మూల భాషలూ కుటుంబాల గురించి తప్పకుండా చాలా పరిశోధన జరుగుతోంది, అలాగే చాలా మంది దాని తో ఇలాంటి ఆశక్తికరమైనవి చేస్తున్నారు. మరి అది అన్నందుకు, ఇంకొక భాగానికి వెళ్ళి ఇవన్ని ఇప్పుడు ఎలా అవుతున్నాయో చూసి భవిష్యత్తులో ఏం అవుతుందో కూడా చూద్దాం.

భవిష్యత్తు

ఇప్పుడే మాట్లాడిన విషయం, కుటుంబాలు కనిపెట్టడం చూస్తే తప్పకుండా అది ఇంకా జరుగుతున్నది. చాలా మంది ఎన్నో కుటుంబాలకు ఉద్దేశాలు ఇచ్చారు, చాలావి తప్పనుకున్నా, కొన్ని ఇంకా నిజం అవ్వచ్చంటున్నారు. ఉదాహరణకు, ఈ మధ్య డినే-ఎనిసెయి అనే కుటుంబం ఉందని చాలా మంది ఒప్పుకుంటున్నారు, ఇందులో తూర్పు రష్యా, పశ్చిమ అమెరికా రెండిటి స్థానిక భాషలున్నాయి. మెల్లిగా అయినా, పరిశోధన అవుతుంటే భవిష్యత్తులో ఇంకా చాలా ఆవిష్కరణలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే చెప్పినట్టు భాషల మార్పులు కూడా భవిష్యత్తులోకు జరుగుతూ ఉంటాయి, మరి ఇప్పుడు అవుతున్న మార్పులు చూసినప్పుడు ఎన్నో శతాబ్దాలు ఇదివరకు మారినట్టు భాష ఇంకా మారుతోందనుకోవచ్చు, కాబట్టి నాకు అయితే భవిష్యత్తులో ఏ మార్పులు వస్తాయో అనుకుంటే సరదా గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడే చెప్పలేం, కాబట్టి దాని గురించి ఆలోచించక్కర్లేదు, భాషలు వాడుతుంటే కొత్త పదాలు, అర్థాలు, ధ్వనులు వస్తాయి వెళ్ళతాయి. కానీ భవిష్యత్తులో ఉన్నట్టు చరిత్రలో కూడా చాలా రహస్యాలున్నాయి. కాబట్టి మరొక భాగానికి వెళ్ళదాం చివరి ముందు.

డినే-ఎనిసేయి భాషలు

రహస్యాలు

ఇవి అన్నిటి కంటే ఆశక్తికరమైనవి, కాబట్టి రహస్యాల గురించి నా వచ్చే బ్లాగ్లలో మాట్లాడుతానేమో, కానీ ఇప్పటికి కొన్ని విషయాలు ఉదాహరణ గా చెప్తాను.

మొదటి గా, చాలా మంది బాస్కు భాష పెద్ద రహస్యమంటారు, ఎందుకంటే అది ఏ కుటుంబంలోకి రాదు. కొంత మంది అది వేరే గ్రహం నుండి వచ్చిందంటారు, కానీ కుటుంబాలు లేకుండా చాలా భాషలు ఉన్నాయి, మరి వీటికి చాలా సార్లు కుటుంబాలుండేవిగానీ వాట్లో ఒక్కటే మిగిలింది (బాస్కు లాగా). కానీ ఇది తక్కువ రహస్యమన్నను.

ఇన్ని భాషలు తెలిసినా ఎన్నో భాషలూ మొత్తం కుటుంబాలు మరచిబోయుండుంటాయి. ఇండో-ఐరోపా భాషలకు కూడా ఎన్నో శాఖాలున్నాయి, వాటి గురించి తక్కువ తెలుసు, కాబట్టి ఇండో-ఐరోపా భాషలకు దగ్గర గా సంబంధించిన వేరే భాషలు కూడా ఉండచ్చు, కానీ అవి మాయమైపోయాయి. అలాగే ఇప్పుడు కూడా మనకు తెలియన భాషలున్నాయి, ఉత్తర సెంటినెలీ భాష ఉదాహరణకు. వీటి తో మిమ్మల్ని ఇంకా ఆలోచనలు ఆలోచించనిస్తాను, కానీ నేను ఇవి నాకు తెలిసినవి లేకపోతే నేను అనుకున్నవి కొన్నే. మీకు ఇంకా తెలుస్తే చెప్పండి.

బాస్కు నాడు చిత్రం. ఇక్కడ ఏం రహస్యాలుంటాయో...

చివరి

దీని పైన ఎన్నో విషయాలున్నాయి చెప్పడానికి, మరి అందుకే నేను చాలా బ్లాగ్లు చెయ్యాలనుకుంటున్నాను, కానీ ఈ బ్లాగు మంచి ప్రారంభం గా చెయ్యాలనుకున్నాను, కాబట్టి మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నాకు ఈ విషయాల గురించి భాషాశాస్త్రం చదివే వాళ్ళంత తెలియదు, కానీ అంతర్జాలంలో భాషాశాసత్రంలో చాలావాటి గురించి ఏవో నేర్చుకున్నాను, కాబట్టి బ్లాగ్ల ద్వారా వాటి గురించి మాట్లాడేముందు ఇది మొదటి గా చెయ్యాలనుకున్నాను, అలాగే తర్వాత వచ్చే బ్లాగ్లలో ఉండబోతున్న విషయాల గురించి ఎక్కువ చెప్పాను.

మీకు చదివినందుకు ధన్యవాదమూ మరి వచ్చే బ్లాగు వరకు వెళ్ళి వస్తాను! కానీ మీ వ్యాఖ్యలు చూస్తాను :)

4 Comments
+4
Level 58
Apr 12, 2023
Great blog! Besides it has always annoyed me when people assume that it is easy to learn any language from Northern India (e.g. Hindi) because you already know one (in my case, from Southern India).
+3
Level 76
Apr 12, 2023
ధన్యవాదం సూరజ్! అవును, చాలా బయట వాళ్ళకు, కొన్ని భారతీయలుకు కూడా దక్షిణ భారతదేశ భాషలు గురించి అంతగా తెలియదు. కానీ నాకు అయితే నిజానికి ఉత్తర భారతీయ భాషలు ద్రావిడ భాషల కంటే తేలిక గా కనిపిస్తాయి హః
+4
Level 65
Apr 12, 2023
అద్భుతమైన వ్యాసం
+3
Level 76
Apr 12, 2023
ధన్యవాదం!